Monday, 13 July 2015

గడుస్తున్న క్షణాలు


చల్లదనం  ఎలా తెలుస్తున్నదో
               వెచ్చదనం ఎలా తెలుస్తున్నదో
గడుస్తున్న ప్రతి క్షణం అలానే తెలుస్తోంది

ప్రతి క్షణం నాకు చెప్పి వెళ్తున్నంతగా
                          స్పష్టంగా తెలుస్తోంది
గడవనంటూ ప్రతి ఘడియ చేస్తున్న మారం
                          స్పష్టంగా తెలుస్తోంది                  

వెళ్తున్న నిముషాలు వేస్తున్న ముద్రలు
                        అన్నీ  దాస్తున్నాను
 మౌనంగా  మలుపులన్నీ  గమనిస్తూ వున్నాను 


కళ తప్పని పూలు

దారంతా పరుచుకున్న పూలు
            కళ తప్పని పూలే  - ఏ పరిమళం లేని పూలు
           వడిలిపోని పూలే - ఏ ఎండకీ స్పందించని పూలు

దృశ్యానికి మాత్రం రంగులద్దుతున్నాయి
           కళాత్మకంగా...  సృజనాత్మకంగా...
           దారంతా పరుచుకున్నాయి - ఈ కళ తప్పని కృత్రిమ పూలు

Sunday, 5 July 2015

కరిగే మేఘం


మనసుని కమ్మిన మబ్బులు తొలగుతున్నాయి
శక్తినంతా కలిపి  మబ్బులని తరుముతున్న గాలి
            - క్షణక్షణం కొత్త మలుపులతో చైతన్యం కలిగిస్తోంది
మబ్బుల మాటునుంచి బయటికి వస్తున్న  ప్రతి కిరణం
            - ఏ అవకాశాన్నీ వదలనని పట్టుదలగా వుంది
కారుమేఘం మెల్లగా పలుచనవుతూ కదిలిపోతోంది.
కటిక చీకటి చిన్నగా కరుగుతూ కనుమరుగవుతోంది .

ఎంత దట్టమైనదైనా  దాని విచ్ఛిన్నం తప్పటం లేదు
పారద్రోలే ప్రయత్నం అంత పటిష్టంగా ఉంది...
విచిన్నమై, బలహీనమై, బయలుదేరక మరి తప్పటం లేదు ...
వెళుతూనే కురుస్తూ కదిలిపోయింది మేఘం
కొద్దికొద్దిగా పెరుగుతూ పరుచుకుంటోoది కిరణం
మెల్లమెల్లగా స్పృశిస్తూ పలకరిస్తోంది పవనం
ఇక్కడే ఇంకో విచిత్రం -
విలయం సృష్టించాలనే  విఫలయత్నం లో 
వాన వదిలిన చినుకు సైతం కిరణ కాంతిలో మెరుస్తోంది ... 

ప్రకృతి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది -
అంతలోనే మహోగ్రరూపం - మరేదో చల్లార్చే అంశం
ఎందులోనూ ఇమడని తత్త్వం - ఎక్కడయినా ఒదిగే వైనం
ఏమి జరిగినా చెదరని స్థైర్యం  - చిరు తాకిడికే కరిగే నైజం

మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు...
ఎత్తులు-పల్లాలు   వెలుగులు-చీకట్లు
మనోధైర్యమే అండగా ప్రయాణం సాగిపోవాలి
                               గమ్యం చేరుకోవాలి

వెలుతురు

పరుచుకుంటున్న వెలుతురు చీకటిని ఎలా తరుముతున్నదో చూడు
కలలు వెతుకుతున్న దారి కనుల ముందరే రూపుదిద్దుకుంటున్నట్లు
నిన్న తెలియని కొత్త లోకం ఈ రోజే తలుపు తీస్తున్నట్లు
నిన్న కలగని కొత్త భావం ఈ రోజే పలుకరిస్తున్నట్లు ...